Friday, November 16, 2012

ఒక కళ్యాణి...ఒక ప్రతిమ...


ఎవరా ఇద్దరూ అనుకుంటున్నారా, మనుషులే లెండి, చెప్పాలంటే, విధి వంచితలు............. స్టాప్... అంత సానుభూతి అవసరం లేదు. సరే కరెక్ట్ గా చెప్పాలంటే విధి ని వంచే తలలు (కొత్త పదం నేనే కనిపెట్టా అర్థం విధిని జయించినవాళ్ళు)
గాంధీజీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడడానికి ఎంత కష్టపడ్డాడో నేను చూడలేదు గానీ, వీళ్ళు మాత్రం పరిస్థితులతో అంత కన్నా ఎక్కువే కష్టపడి పోరాడారు, పోరాడుతూనే ఉన్నారు కూడా. స్ఫూర్తి ప్రదాతలంటే ఎక్కడో పుస్తకాల్లోనే ఉండరు, బాగా గమనిస్తే మన చుట్టుతా కూడా కనిపిస్తారు, అంతులేని ఆత్మవిశ్వాసంతో అడుగడునా ఎదురయ్యే సవాళ్ళని స్వీకరిస్తూ అలుపెరుగకుండా పోరాడుతూనే ఉంటారు. ఏంటి అర్జెంట్ గా వీళ్ళు ఏం చేసారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆగండాగండి, వీళ్ళేమీ కొత్త వస్తువులు కనిపెట్టలేదు, వీళ్ళకేమీ అవార్డులు రాలేదు, రాజకీయాల్లో లేరు. ఇంకేం చేసారు? వీళ్ళేమీ చేయలేదు, జస్ట్ పెళ్ళి చేసుకున్నారు, అంతే. ఇంకా anxiety పెరిగిపోయిందా? ఇంక విసిగించనులెండి. చెప్పేస్తున్నా.
ముందు కళ్యాణి, అందంగా తెల్లగా అమాయకంగా ఉంటుంది. నాన్నకి గారాల కూతురు. చిన్నప్పటి నుండి ఏం కావాలంటే అది కాళ్ళ దగ్గరికి వచ్చేది. కష్టం అంటే తెలియదు. కాలేజ్ కి వచ్చాక తన మనసుకి దగ్గరైన బుజ్జిని ప్రేమించింది. అతను కూడా ప్రాణం కంటే మిన్నగా అభిమానించాడు, ఆరాధించాడు. అన్ని ప్రేమకధలలాగానే, దీనికీ ఎన్నో ఆటంకాలు, అన్నింటినీ ఎదిరించి ఒకటిగా నిలిచారు.పెద్దల్ని ఒప్పించారు. చక్కగా పెళ్ళి చేసుకున్నారు. ముచ్చటగా ఇల్లు దిద్దుకున్నారు. అటు వాళ్ళకి, ఇటు వాళ్ళకి తామే ఆసరాగా మారారు.
అంతా చక్కగా నడిస్తే అది జీవితం ఎందుకవుతుంది? బుజ్జికి ముప్పయ్యేళ్ళు నిండకుండానే నూరేళ్ళూ నిండిపోయాయి. ఒక్కసారిగా వచ్చిపడ్డ కుదుపు, కళ్యాణిని అల్లకల్లోలం చేసింది, కళ్ళ ముందే ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపొయిన భర్త, మంచం పట్టిన అమ్మ, అత్త, అమ్మమ్మ, వయసు పెరిగినా మనసు పెరగని అక్క, భాధ్యత లేని మరిది, చేతిలో లేని డబ్బు, ఒక్కటేమిటి సమస్యగా కనిపించని ఒక్క విషయం కూడా లేదు.
ఒకపక్క పెళ్ళైన సంవత్సరంన్నర్రకే భర్తని పోగొట్టుకుంటే, ఇంకోపక్క అమ్మలక్కల సూటిపోటి మాటలు. ఒకప్పుడు తను, తన బుజ్జి లేదనకుండా సాయం చేసిన స్నేహితులు ఇప్పుడు కనిపించకుండ పోయారు. వారం వారం ఇంటికొచ్చి భోజనం చేసిన వాళ్ళు, ఆఖరి చూపుకు కూడా రాలేదు. భర్త తనకోసం ముచ్చటపడి కొన్న చీరల నుండి పూచిక పుల్ల కూడా లేకుండా అత్తింటివాళ్ళు దొచేసారు. ఏం కట్నం తెచ్చావని పోషించాలంటూ మాట్లాడరు. ఆఫీస్ వాళ్ళిచ్చిన అరకొర సాయం కూడా, విదేశాల్లో ఉండే బావగారొచ్చి తీసుకెళ్ళిపోయారు. అత్తారింటి తరపు బంధువులు పెళ్ళి చేసుకొని పిల్లాడిని పొట్టనపెట్టుకుందంటే, అమ్మవారింటి తరపు బంధువులు చేసుకొన్నమ్మకి చేసుకొన్నంత జరిగిందన్నారు. అంతేగాని తన బాధను పంచుకున్నవాళ్ళు లేరు. తప్పదు గనుక తీసుకెళ్ళారు అమ్మనాన్న. పూర్వం ఇంటికొస్తే అపురూపంగా చూసేవాళ్ళే, ఎదురొస్తే అపశకునం అనుకొన్నారు.
తన బుజ్జి లేకుండా ఎప్పటికీ ఉండలేననుకున్న తను, తనేనా ఇప్పుడు? ఇంత జరిగాక తనెందుకుండాలి? ఎవరి కోసం ఉండాలి? ఎలా బతకాలి? నిన్నటిదాకా ఎంతో బాగుండే ప్రపంచం ఒక్కసారిగా ఇంత కర్కశంగా ఎలా మారిపోయింది? ఎందుకు తనకే ఇలా జరిగింది? అసలు దేవుడున్నాడా? ఎంత ఏడ్చినా ఏ ప్రశ్నకీ సమాధానం దొరకలేదు, కన్నీరు ఎండిపోలేదు, అలా రోజులు గడిచాయి, మెల్లగా ఆత్మప్రభోధం అర్ధమవసాగింది. మూలన పడేసిన సర్టిఫికెట్ ల దుమ్ము మెల్లగా దులిపింది, ఉద్యొగంలో జాయిన్ అయింది, తనకిష్టమైన టీచర్ జాబ్. చుట్టూ ఉత్సాహం తొణికిసలాడే పిల్లల సాంగత్యంలో ఇప్పుడు మెల్లగా కోలుకుంటుంది. డబ్బు వెనకే మనుషులనే సత్యం తెలుసుకొంది. బుజ్జి అన్న మాటలు తలచుకొంటూ ఉంది - " చిన్నీ, ఫ్రపంచంలొ మార్పు రావాలంటే ముందుగా అది పిల్లలతోనే మొదలవ్వాలి, అందుకే ఎప్పటికైనా ఒక మంచి స్కూల్ నేనే మొదలుపెట్టేస్తా."
ఇక ప్రతిమ, మంచి ఎత్తు, చూడగానే ఆకట్టుకొనే కళ్ళు, ఇది ఇప్పటి రూపం, మరి ఒకప్పుడు. . .
 గారాంగా, ఏ కష్టమూ రాకుండా పెంచిన తండ్రి ఇచ్చిన ఆస్థినంతా వ్యసనాల బారిన పడి పోగొట్టుకొని పరిస్థితులకు బానిసగా మారి, చెడు స్నేహితుల సావాసంతో బాధ్యతలకు భయపడి తన తండ్రి ఇంటి నుంచి పారిపొయాడు.ఇది మొదటిసారి కాదు, తన బాల్యం నుంచి తనకు బాగా అలవాటైన వ్యవహారమే. ఎప్పుడూ ఇల్లు పట్టకుండా తిరిగే తండ్రి, తండ్రిని ఏమీ అనలేక, చాటుమాటుగా ఏడుస్తూ పిల్లలను పెంచలేక నానా అవస్థ పడే తల్లి, ప్రతిసారీ ఇంటి నుండి పారిపోవడం, ఎవరో ఒకరు వెతికి తీసుకురావడం. మామూలేగా అనుకుంది, కానీ తనకి అప్పుడు తెలియదు, తండ్రి వల్ల బాగా ఎఫెక్ట్ అయింది ఆడ పిల్లైన తన జీవితమేనని. నికరం లేని భర్తని నమ్మలేక, బంధువుల సలహాతో పిల్లకి పెళ్ళి చేయాలని నిర్ణయించిన తల్లితో, తను ఏకీభవించలేదు, అలాగని వ్యతిరేకించలేదు. పెళ్ళి గురించి ఒక నిశ్చితాభిప్రాయం లేకముందే, అసలు అంటే ఏంటో తెలియకుండానే పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఒక ఊహ, ఒక అభిప్రాయం ఏమీ లేకుండానే పదహారు సంవత్సరాల చిన్న వయసులోనే ఒకడికి భార్యగా మారింది. నర రూప రాక్షసుడి ఇంటికి, మేకపిల్లలాగా వెళ్ళింది. అక్కడ అనుభవించని అవమానం లేదు, పడని కష్టం లేదు. మగాడు కాని భర్త, ఆ తప్పును కప్పి పుచ్చుకోవటానికి, హింసనే మార్గంగా ఎంచుకున్నాడు, సాటి ఆడది అనే ఫీలింగ్ కొంచం కూడా లేకుండ, కొడుకు లోపాన్ని కప్పిపుచ్చుతూ అనుమానంతో అనుక్షణం నరకాన్ని దగ్గర నుండి చూపించే అత్త. అలవాటు లేని చాకిరీ.అత్త గానీ, భర్త గానీ బయటకు వెళ్తే తలుపు బయట నుండి తాళం వేలాడడమే. నాన్న ఇంటికి తిరిగివచ్చాడని తెలిసినా ఆనందించలేకపొయింది. ఇంకేంటి లాభం, జరగాల్సింది అంతా జరిగిపోయాక.
 ఆ చిన్న వయసులో అసలు తనంటే ఎందుకు కోపమో తెలియదు, అమ్మకు చెప్పుకోవాలనీ అనిపించలేదు, కనీసం తనైనా ఆనందంగా ఉన్నానని అనుకోవాలని, తన బాధంతా తనలోనే దాచుకొంది. తన తాతగారంటే ఉన్న కొంచం అభిమానం వల్ల, తన మామగారు చూపించే కొంచం ఆప్యాయతే ఆ చీకటిలో వెలుగు, కానీ ఆయన ఉద్యోగరీత్యా ఇంట్లో ఉండేవారు కాదు. అప్పుడప్పుడు ఆయన వచ్చే ఒక రోజు,రెండు రోజులు మాత్రమే కొంచం మనశ్శాంతి. కనీసం పుట్టింటికి వెళ్ళాలన్నా కుదరదు. ఊర్లోనే ఉండే చుట్టాల దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఎవరైనా తనని చూడడానికొస్తే మాత్రం వాళ్ళలోని నట సామ్రాట్టులు బయటకు వచ్చేవాళ్ళు. ఎంతో ప్రేమ ఒలకబోసెవాళ్ళు. కొట్టే వాళ్ళు, వాతలు పెట్టే వాళ్ళు, భయంకరంగా తిట్టే వాళ్ళు, అడ్డమైన చాకిరీ చెయించేవాళ్ళు. ఇలా బాధలకీ, కష్టాలకి, కన్నీళ్ళకి అంతు లేకుండా పోయింది.
ఒక రోజు, చెప్పకుండా ఇంటికి వచ్చిన మామగారికి విషయం మొత్తం అర్ధం అయింది.గట్టిగా అడిగిన ఆయన్ని, తల్లి కొడుకు కలిసి నెట్టి పడేశారు. ఇంక ఆ రాత్రి, తన పాలిట కాళ రాత్రే అయింది.  తాగి ఇంటికి వచ్చి నానా రభస చేస్తే, ప్ర్రాణ భయంతో ఆ రాత్రంతా బాత్రూంలోనే గడిపింది. తెల్లారగానే, మామగారి సహాయంతో ఊరు దాటేసింది. ఇంటికి వచ్చింది. అమ్మయ్య అనుకుంది. కానీ తను ఇంటికి రాకముందే, తను ఎవరితోనో పారిపొయాననే విషయం ఇల్లు చేరింది. తనని చూడగానే అమ్మకు మాత్రం విషయం అంతా అర్ధం అయ్యింది, ఎందుకంటే వళ్ళంతా దెబ్బలేగా. ఆవేశంగా అడగడానికి వెళ్ళిన నాన్నని కొట్టి ఊరవతల పడేశారు. చిన్నవాడైన తమ్ముడు  పళ్ళు కొరుక్కోవటం తప్ప ఏంచేయలెడు. పోలీసులు, కోర్టులు ఏవీ న్యాయం చేయలేకపోయాయి, బహుశా న్యాయం దక్కాలంటే ఇంకో జీవితకాలం కావాలేమో కేసు పూర్తి కావడానికి. కోల్పోయిన జీవితంతో పాటు, తల మీద నిందలొకటి బోనస్ గా. తను స్థాణువైంది. ఎంతో జీవితం చూసిన అమ్మ మాత్రం తట్టుకుని నిలబడింది. కాలం మెల్లగా గడిచింది. నాన్న పూర్తిగా కోలుకున్నడు, శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. తన వల్ల కూతురి జీవితం నాశనం అయ్యాకనే తన తప్పు తెలిసొచ్చింది మరి.
గడిచిన ఒక్కొక్క రోజు,తను కోల్పోయిన జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి. ఫ్రతి ఙ్ఞాపకం తన గమ్యాన్ని గుర్తు చేయసాగాయి. ఎవరో చేసిన తప్పుకు తనెందుకు శిక్ష అనుభవించాలి? తను చేయని తప్పులకు తనెందుకు నిందలు పడాలి, మెల్లగా ధైర్యం కూడగట్టుకుంది, అందర్నీ లెఖ్ఖ చేయడం, తనలో తను కుళ్ళిపొవడం మానేసింది.   ఆలోచించసాగింది. అందరి నోళ్ళు మూత పడాలంటే ఎం చేయాలి? అప్పుడే తెలిసిన వాళ్ళెవరో వచ్చి పెళ్ళి శుభలేఖ ఇచ్చి వెళ్ళారు. అమ్మ అంటోంది, పెళ్ళి కూతురు M.B.A అంట, భలే బాగా చదివించారు కదా అని. అంతే తన అన్వేషణ పూర్తయింది. గమ్యం కనిపించింది.  M.B.A కి అర్థం అప్పటికి తనకి తెలియదు కాని సంకల్పించుకుంది, నేను ఎప్పటికైనా అదే చదవాలని.  ఎప్పుడో ఇంటర్ ఫస్టియర్లో వదిలేసిన చదువును తిరిగి మొదలుపెట్టింది. ప్రైవేట్ గాMAT exam రాసి అందు qualify అయింది. ఒక మంచి business school లో, admit అయింది. ఇప్పుడు పేరు చివర M.B.A చేర్చుకుంది. మంచి జాబ్ తెచ్చుకుంది. త్వరలో తన మనసుకు నచ్చిన వాడితో తన పెళ్ళి కూడా జరగబోతుంది. Good luck Pratima.
ఇవి రెండూ నా స్నేహితుల కధలు, నిజ జీవిత సంఘటనలు.కష్టం అంటే ఎవరి అర్థం వారిది,వాళ్ళ వాళ్ళ పొజిషన్ నుండి చూస్తేనే అది మనకి అర్థం అవుతుంది. ఇదంతా చదివాక ఓస్ ఇంతేనా అని పెదవి విరిచే వాళ్ళుండచ్చు, అయ్యో అనుకునే వాళ్ళుండచ్చు,కాని ఇది వాళ్ళందరి కోసం కాదు. ఇది చూసి స్ఫూర్తి తెచ్చుకొనేవాళ్ళ కోసం, మన ప్రవర్తన ఎదుటివాళ్ళని ఎంత బాధపెడుతుందో తెలుసుకొని మారే వాళ్ళ కోసం.
 నా ఈ చిన్న ప్రపంచంలోనే ఇంతమంది ఉంటే, మనందరికి తెలియనివాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కదా?

3 comments: